తెలుగులోని మాండలికాలు
మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. మాండలిక భాషలన్నీ ప్రధానభాషలోని వివిధ వ్యవహారికాలు మాత్రమే, అన్ని మాండలికాలూ కలిపితేనే ప్రధాన భాష అవుతుంది. ప్రతి భాషకీ మాండలిక భేదాలున్నట్టుగానే, తెలుగుకీ ఉన్నాయి.
భౌగోళిక పరిస్థితులను బట్టీ, పాలకుల భాషను బట్టీ, కులమతాలను బట్టీ, వృత్తిని బట్టీ మాండలికాలు ఏర్పడతాయి. ఉదాహరణకి తెలంగాణ తెలుగుపై మొదట తమిళ, కన్నడ భాషల ప్రభావమూ, ఆ తరవాత ఉర్దూ ప్రభావమూ పడటం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక, చారిత్రక కారణాల రీత్యా రాయలసీమ తెలుగుపై తమిళ, కన్నడ భాషల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అదో భిన్నమైన ప్రత్యేకతను సంతరించుకున్నది. కోస్తాంధ్ర తెలుగుపై సంస్కృతం, ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అదో ప్రత్యేకతను సంతరించుకున్నది.
జిల్లాలను బట్టి కూడా వేరువేరు మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు నాలుగున్నాయి.
1) రాయలసీమ భాష: చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల భాష
2) తెలంగాణ భాష: తెలంగాణ పది జిల్లాల ప్రాంతపు భాష
3) తీరాంధ్ర/కోస్తాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల భాష
4) కళింగాంధ్ర/ఉత్తరాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాష
తెలుగు సాహిత్యం
నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీ, నన్నయ ఆదికవి అనీ చెప్పబడుతున్నది. అంతకు ముందు సాహిత్యం అసలే లేకుండా, ఉన్నట్టుండి ఇంత అద్భుతమైన, పరిపక్వమైన కావ్యం రచించడం అసాధ్యం కాబట్టి, నన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయం.
పదహారో శతాబ్దంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు వైభవంగా వెలిగింది. ఎంతో సాహిత్యం సంస్కృతం నుంచి తెలుగు, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఈకాలంలో వివిధ సాహితీప్రక్రియల్లో వెల్లువలా సృష్టించబడ్డ ఎంతో సాహిత్యం సాహిత్యాభిమానుల, విద్యావంతుల అభిమానాన్ని చూరగొనగలిగినప్పటికీ, సంస్కృతభాష ప్రభావం కారణంగా చాలామటుకు గ్రాంథిక భాషలో ఉండడం వల్ల ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం పొందలేకపోయాయి. పల్లె ప్రజలకు, నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థం అయ్యే విధంగా వాడుకభాషలో సరళమైన రీతిలో వెలువడ్డ వేమన పద్యాలు, బ్రహ్మంగారి సాహిత్యమూ, అన్నమయ్య, కంచెర్ల గోపన్న రాసిన కీర్తనలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి.
ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేత గిడుగు రామ్మూర్తి, శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, నండూరి రామ్మోహనరావు ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
మనోహర్ నిభానుపూడి
|