జో అచ్యుతానంద జోజో ముకుందా రార పరమానంద రామ గోవిందా ||జోజో||
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగా
నందముగ వారిండ్ల నాడుచుండగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||జోజో||
పాలవారాశిలో పవళించావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||జోజో||
అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడుగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||జోజో||
అంగజుని గన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||జోజో||
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమ్ముననున్న కంసు బడగొట్టి
నీవు మధురాపురము నేల చేపట్టి
� ీవితో నేలిన దేవకీపట్టి ||జోజో||
రంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా జెప్పె నీ జోల
సంగతిగ సకలసంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||జోజో|| |