Bhaskara Satakam

భాస్కర శతకం

1
ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా! |చ|
2
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! |చ|
3
తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్
వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం
గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా! |చం|
4
ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా
నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్
దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా! |చ|
5
బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! |చ|
6
సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడే ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! |ఉ|
7
పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! ||
8
దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర
త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! |ఉ|
9
తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! |చ|
10
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా! |ఉ|
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel